వార్తలు
చర్లపల్లి జైలుపై నిర్లక్ష్యం క్రీనీడ
రాష్ట్రవ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువుగా మారుతున్న కేంద్ర కారాగారాల పని తీరుపై విమర్శలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా చర్లపల్లి జైలు కేంద్ర కారాగారంలో జరుగుతున్న కార్యక్రమాలపై, జైలు అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విమర్శలు గుప్పుమంటున్నాయి. రాష్ట్రంలో సంచలనం కలిగించిన మాజీ మంత్రి పరిటాల రవీంద్ర హత్యకు చర్లపల్లి కేంద్ర కారాగారంలోనే పథకాన్ని రూపొందించినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. పరిటాల రవి హత్యకు ముమ్దు జూలకంటి శ్రీనివాస్ రెడ్డి అలియాస్ మొద్దు శ్రీను పలుమార్లు చర్లపల్లి జైలుకి వచ్చి ములాఖాత్ లో సూరిని కలిసినట్లు వచ్చిన వార్తలు సంచలనం కలిగించాయి. కాగా అనంతపురం జిల్లా జైలులో మొద్దు శీను హత్యకు గురి కావడం, చర్లపల్లి కేంద్ర కారాగారంలో గత కొంతకాలంగా జరుగుతున్న సంఘటనలపై సర్వత్రా విమర్శలు తలెత్తడం జైళ్ళ అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నాయి. ములాఖాత్ విషయంలో జైలు సిబ్బంది, అధికారులు ఇష్టానుసారం వ్యవహరిస్తున్నారని పలువురు ఖైదీలు ఆరోపిస్తున్నారు. జైల్లో రహస్యంగా గంజాయి సేవిస్తూ పట్టుబడిన ఖైదీలకు గంజాయి ఎక్కడ నుండి వచ్చిందో అధికారులు చెప్పడం లేదు. గత కొంతకాలం కిందట ఓ జైలర్, సిబ్బంది ఓ ఖైదీపై విచక్షణారహితంగా దాడికి పాల్పడ్డంతో ఆ ఖైదీ మృత్యువాత పడ్డాడు. జైల్లో ఖైదీల కోసం సకల సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్న అధికారులను షాక్ గురి చేస్తూ ఓ ఖైదీ టవర్ పైనుండి దూకి పారిపోయేందుకు ప్రయత్నించిన విషయంలో భద్రత ఎంత గొప్పగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అదే విధంగా కొద్ది రోజుల క్రితం జరిగిన గీతాగోవిందం కార్యక్రమానికి వచ్చిన రాష్ట్ర హోంమంత్రి సమక్షంలోనే జైలు అధికారులు వేధింపులకు గురి చేస్తున్నారని పేర్కొంటూ ఓ ఖైదీ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇవే కాదు ఇలాంటి సంఘటనలెన్నింటికో చర్లపల్లి జైలు కేంద్రబిందువుగా మారింది.వాటిలో కొన్నింటిని పరిశీలిస్తే...
1) చర్లపల్లి జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూరి తన ఇష్టానుసారంగా ప్రవర్తిస్తూ జైల్లోనే పథక రచన చేసేవాడని ఆరోపణలున్నాయి.
2) ఐదు సంవత్సరాల క్రితం చర్లపల్లి జైల్లో బిర్యానీ ప్యాకెట్లు దర్శనం ఇచ్చాయి. ఈ సంఘటన బయటకు పొక్కడంతో పలువురు సిబ్బందిపై చర్యలు తీసుకున్నారు.
3) మద్దెల చెర్వు సూర్యనారాయణ (సూరి)తో మొద్దు శీను సన్నిహితంగా ఉన్నంతకాలం చర్లపల్లి జైలు సంచలనాలకు నిలయంగా మారింది. అక్కడే శిక్ష అనుభవించినంత కాలం జైలు అధికారులతో కలిసి భూవివాదాలు, సెటిల్ మెంట్లు చేయడం వంటివి అందరికీ ఆందోళన కలిగించాయి.
4) చర్లపల్లి కేంద్ర కారాగారంలో పని చేస్తున్న ఓ డిప్యూటీ జైలర్ శ్రీనివాస్ నాయక్ ను శీను భూవివాదాలు, సెటిల్ మెంట్లకు వినియోగించుకున్నాడన్న ఆరోపణలతో అతనిపై చర్యలు తీసుకున్నారు.
5) జైల్లోని అధికారుల అండదండలతో సూరితో బాటు శీను యధేచ్చగా సెల్ ఫోన్లు వినియోగించడంపై పలు ఆరోపణలు వచ్చాయి.
6) మొద్దు శీనుకు జైలు అధికారులతో బాటు ఇక్కడ డాక్టర్ గా పని చేసిన సాంబశివరావుకు సంబందించిన సెల్ ఫోన్ వినియోగించుకునేవాడని ఆరోపణలు వెల్లువెత్తాయి.( ఆ సాంబశివరావు రైల్లో ప్రయాణిస్తూ అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై పడి మరణించాడు)
7) మొద్దు శీనుకు తన బావమరిది వరుస అయ్యే వెంకట రెడ్డి జైల్లోకి సెల్ ఫోన్ విసిరే ప్రయత్నం కేసులో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదయింది.
8) జైల్లో అధికారులు కావాల్సిన వారికి విలాసవంతమైన సౌకర్యాలు కల్పిస్తున్నారని పలుమార్లు ఖైదీలు ఫిర్యాదు చేశారు. అయినా ఫలితం శూన్యం.
9) ములాఖత్ విషయంలో సిబ్బంది, అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారని ఖైదీల బంధువులు కూడా ఆరోపిస్తున్నారు.
10) అవసరమైన వారికి బిర్యానీ ప్యాకెట్లు అందిస్తూ మిగిలిన ఖైదీల ఆహార విషయంలో పోషక విలువల ఆహారం, మంచినీరు అందించడం లేదనీ, సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని విమర్శలు వస్తునాయి. ఇది కేవలం ఒక్క చర్లపల్లి కేంద్ర కారాగార పరిస్థితి మాత్రమే కాదు రాష్ట్రంలో ఉన్న చాలా జైళ్ళలో ఇలాంటి వాతావరణమే నెలకొని ఉంది. జైళ్ళలో ఉన్న ఖైదీలకు సౌకర్యాలు కల్పించి, వారిలో మార్పు తీసుకురావాల్సిన జైళ్ళు నరకాలకు నకళ్ళుగా మారుతున్నాయి. ఈ విషయంపై ఎన్ని విమర్శలు, ఆరోపణలు వచ్చినా అధికారుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకప్పుడు క్రూర స్వభావం గల నేరస్తులు, కరడు కట్టిన తీవ్రవాదుల వంటి వారిని ఉంచే తీహార్ జైలు అంటే ఇప్పటి వరకూ జనం భయపడేవారు, కానీ ఇప్పుడు జరుగుతున్నసంఘటనలను చూసి చిన్నజైళ్ళన్నా ఉలిక్కిపడే పరిస్థితి నెలకొంది


0 కామెంట్‌లు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]
<< హోమ్