11, నవంబర్ 2008, మంగళవారం

తెలుగుకు ప్రాచీన హోదా

తెలుగుకు 'ప్రాచీన' వెలుగు
నవంబర్ 1 వ తేదీ ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం రోజున కేంద్ర ప్రభుత్వం తెలుగుప్రజలకు అరుదైన బహుమతిని అందించింది. తేనెలొలుకు తీయని తెలుగుకు ప్రాచీన హోదా కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కేంద్ర సాహిత్య అకాడమీ నేతృత్వంలోని భాషానిపుణుల సంఘం చేసిన సిఫారసును ఆమోదిస్తున్నట్లు సాంస్కృతిక వ్యవహారాల మంత్రి అంబికా సోనీ వెల్లడించారు.తొమ్మిదిమందితో కూడిన నిపుణుల సంఘంలో ఎనిమిది మంది తెలుగు, కన్నడ భాషలకు ప్రాచీన హోదా కల్పించాలని సిఫారసు చేశారు. తమిళనాడుకు చెందిన కొళందెస్వామి మాత్రం నిరసన వ్యక్తం చేసారు. అయితే దీనిపై మద్రాస్ హైకోర్టులో దాఖలైన వ్యాజ్యంలో తీర్పు వెలువడ్డాకే తెలుగు, కన్నడ భాషల ప్రాచీన హోదాకు సంబందించిన విషయం అమల్లోకి వస్తుందని అంబికాసోనీ తెలిపారు.
ప్రాచీన హోదాతో లాభం !
తెలుగు, కన్నడ భాషలు 1500సంవత్సరాల క్రితం ఆవిర్భవించినట్లు గుర్తించి ప్రాచీన హోదా కల్పించారు. దీనివలన ఈ భాషలకు పలు అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. ఈ భాషలలోని రచనలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుంది. ఈ భాషల ప్రతిభా కేంద్రాలను నెలకొల్పే అవకాశముంది. యుజిసితో బాటు వివిధ పరిశోధనా సంస్థల నుండి, యూనివర్శిటీల నుండి గ్రాంటులు లభిస్తాయి. విశ్వవిద్యాలయాల్లో ప్రత్యేక పీఠాలు నెలకొల్పుతారు. భాషా సుసంపన్నానికి మానవ వనరుల మంత్రిత్వ శాఖ ద్వారా పలు రకాల సదుపాయాలు, గ్రాంట్లు పొందవచ్చు. రాష్ట్రప్రభుత్వాలు, వ్యక్తులు, విద్యాసంస్థలు ఈ గ్రాంట్లు పొందే అవకాశం ఉంది.
తెలుగు భాషా అభివృద్ధి సంఘం కృషి...
తెలుగుభాషకు ప్రాచీన హోదా దక్కడంలో రాష్ట్రప్రభుత్వం నియమించిన టాస్క్ ఫోర్స్ కీలకపాత్ర వహించిందని చెప్పవచ్చు. ఇందులో సభ్యులైన యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, మండలి బుద్ధప్రసాద్, ఏబికే ప్రసాద్ తదితరులు ఎంతగానో కృషి చేసి, పలు దఫాలుగా ఢిల్లీ వెళ్ళి కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చారు. వాస్తవానికి ఇతర భాషలకు ప్రాచీన హోదా రాకుండా ఉండేందుకు తమిళులు ఎంతగానో ప్రయత్నించారు. భాషానిపుణుల సంఘంలోని తమిళ సభ్యులు కొళందెస్వామి, కణ్ణన్ ప్రతిఘటించినప్పటికీ రాష్ట్రానికి చెందిన నిపుణులు భద్రిరాజు కృష్ణమూర్తి, సుబ్బారావు, మైసూరు భారతీయ భాషల సంస్థకు చెందిన ఉదయ్ నారాయణ్ సింగ్ తదితరులు తెలుగు, కన్నడ భాషలకు అనుకూలంగా వాదించారు. తమిళ భాషకు ప్రాచీన హోదా లభించినప్పుడు వెయ్యి సంవత్సరాల ప్రాతిపదిక మాత్రమే ఉండేది. అనంతరం మిగిలిన భాషలకు ఆ హోదా దక్కకుండా ప్రయత్నించారు. రెండు వేల సంవత్సరాల వయసున్న భాషలకు మాత్రమే ప్రాచీన హోదా కల్పించాలంటూ అప్పటి కేంద్రమంత్రి దయానిధిమారన్ కేంద్రంపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పదిరోజుల్లోనే కేంద్రం తన నిర్ణయం మార్చుకొంది. 1500నుండి 2000 సంవత్సరాల లోపు ప్రాచీనత ఉన్న భాషకు ఈ హోదా కల్పించాలని 2004 అక్టోబర్ 29న నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇక్కడ విచిత్రమేమిటంటే తమిళ భాషకు ప్రాచీన హోదా కల్పించిన తర్వాతే అత్యంత పురాతనమైన సంస్కృతానికి ఆ హోదా కల్పించాలని కేంద్రం నిర్ణయించడం! ఒకవైపు దయానిధి మారన్, చిదంబరం వంటి కేంద్ర మంత్రులు మరో వైపు నిపుణుల కమిటీలో సభ్యుడిగా ఉన్న తమిళ సాహిటీవేత్త కొళందెస్వామి ఇతర భాషలకు ప్రాచీన హోదా కల్పించకుండా అడ్డం పడుతూ వచ్చారు. చివరకు నిపుణుల కమిటీ నిర్ణయం తీసుకోకుండా అడ్డుపడేందుకు మద్రాసు హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. అయినా ఇన్ని అవాంతరాల మధ్య నాలుగేళ్ళ పోరాటం తర్వాత తెలుగుభాషాభిమానుల కల నెరవేరింది. 'ఈస్ట్ ఆఫ్ ఇటాలియన్' గా పిలుచుకునే తెలుగుకు ప్రాచీన హోదా లభించింది

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్