9, నవంబర్ 2008, ఆదివారం

రాజకీయాలు

వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ ఎవరితో జత కట్టేనో...
ఎన్నికల గడువు సమీపిస్తున్నా రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య పొత్తులకు మాత్రం దూరం పెరుగుతోంది. ఒకరిపై మరొకరు పరోక్షంగా ఒత్తిడి పెంచుకునే వ్యూహంలో భాగంగా ఏ ఒక్క పార్టీ ఇంతవరకూ పొత్తులను ఖరారు చేసుకోలేకపోయింది. ప్రతిపక్షాల మధ్య కొనసాగుతున్న అనైక్యత పొత్తులపై అనిశ్చితి అధికార కాంగ్రెస్‌ పార్టీకి ప్రస్తుతానికి లాభసాటిగా పరిణమించింది. రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పార్టీల పొత్తులు మాటలకే పరిమితమవుతున్నాయి. 2004 ఎన్నికలకు ముందు నాటికి, ప్రస్తుత పరిస్థితి పూర్తి భిన్నంగా కనిపిస్తోంది. ప్రజారాజ్యం అధినేత చిరంజీవి ప్రజా అంకితయాత్ర యాత్ర తరువాతే పొత్తుల గురించి ఆలోచిస్తామని ప్రకటించింది.
ఒంటరిగా కాంగ్రెస్...
గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని అధికారం పొందిన కాంగ్రెస్ వాటిని మెల్లమెల్లగా దూరమౌతూ వస్తోంది. ఈ సారి కాంగ్రెస్ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగానే బరిలోకి దిగనుంది. మజ్లిస్ పార్టీతో పొత్తు అని చెప్పకపోయినా పరస్పర అవగాహన ఉంటుంది. అయినా టీఆర్‌ఎస్‌తో కలిస్తే తమకు అనుకూలిస్తుందని కొందరి నేతల్లో ఉన్నా వచ్చే ఎన్నికల్లో మాత్రం ఒంటరిగానే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.
వ్యతిరేక ఓటుతో టీడీపీ...

తెలుగుదేశం పార్టీలో తమతో ఎవరు కలిసి వస్తారో తెలియని అయోమయం కనిపిస్తోం ది. వచ్చే ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పొత్తు కోసమే తమ పార్టీ తెలంగాణకు అనుకూలమే అని ప్రకటించింది. అయితే చివరి సమయంలో తమను వదిలిపెట్టి, పీఆర్పీ వైపు చూస్తుండడం టీడీపీని కలవరపరుస్తోంది. టీఆర్‌ఎస్‌తో కలిసి నడిస్తే తెలంగాణలో తనకు ఎదురుండదని భావించిన టీడీపీకి, ఆ పార్టీ ద్విముఖ వ్యూహం అంతుపట్టకుండా ఉంది. అదేవిధంగా సీపీఐ కూడా తమతోనే కలిసిరావాలని కోరుకుంటుండగా ఆ పార్టీ మాత్రం పీఆర్పీ వైపు వెళ్లాలని భావిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. సీపీఐ పార్టీ చిరుపార్టీతో కలిస్తే కాంగ్రెస్‌ లాభపడుతుందన్న వాదనతో చంద్రబాబు నాయుడు, సీపీఐ కేంద్ర నాయకత్వంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఏటూ తేల్చని పీఆర్పీ...
కీలకమైన రాజకీయపార్టీగా భావిస్తున్న ప్రజారాజ్యం పార్టీ రానున్న ఎన్నికల్లో ఎవరితో కలిసి పోటీచేస్తుందన్న ఉత్కంఠ మిగిలిన పార్టీల శ్రేణుల్లో కనిపిస్తోంది. నామమాత్రపు క్యాడర్‌ ఉన్న తెలంగాణలో సైతం చిరంజీవి యాత్రకు ప్రజలు బ్రహ్మరధం పట్టడంతో ఆ పార్టీలో ఆత్మవిశ్వాసం పెరిగింది. దీంతో తెలంగాణ యాత్రకు ముందు పొత్తులు పెట్టుకోవాలన్న నిర్ణయంలో మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. తమది కొత్త పార్టీ కాబట్టి, తాము అడిగినన్ని సీట్లు ఇస్తారన్న ఆశతోనే టీఆర్‌ఎస్‌, సీపీఐ వంటి పెద్ద పార్టీలు తమతో పొత్తు కోసం పాకులాడుతున్నట్లు పీఆర్పీ నాయకత్వం అంచనాకు వచ్చినట్లు తెలిసింది. ఆ రెండు పార్టీలతో కలవడం కన్నా ఇచ్చిన సీట్లతో సర్దుకుపోయే నవ తెలంగాణ పార్టీతో సీట్ల సర్దుబాటు ఉండవచ్చని తెలుస్తోంది.
భంగపడ్డ టీఆర్‌ఎస్...
ఈ ఎన్నికల్లో ద్విముఖ వ్యూహం అనుసరించి, ఏక కాలంలో రెండు పెద్ద పార్టీలతో లాభదాయకమైన సీట్ల బేరం ఆడాలన్న టీఆర్‌ఎస్‌ రాజకీయ ఎత్తుగడ దారుణంగా దెబ్బతీసేలా కనిపిస్తోంది. ముందు టీడీపీ నాయకత్వంతో రాయబారాలు నడిపి, తెలంగాణకు జై కొట్టించిన టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఆ తర్వాత పీఆర్పీ నేత చిరంజీవి ఉత్తరాంధ్ర పర్యటన దిగ్విజయం కావడం, ఆ పార్టీలోకి వలసలు పెరుగుతుండడంతో వైఖరి మార్చుకోవడం చర్చనీయాంశమయింది. అంతలోనే ప్రజా అంకిత యాత్రలో చిరంజీవిపై టీఆర్‌ఎస్‌ నాయకులు కోడిగుడ్లతో దాడి చేయడం ఆ పార్టీకి మాయని మచ్చలా మారింది. సామాజిక తెలంగాణ అన్నందుకే తమ అధినేతపై దాడి జరిగిందని, రానున్న ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ను దూరంగా పెట్టాలని పీఆర్పీ నాయకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేసీఆర్‌ కూడా పీఆర్పీతో ఎన్నికల పొత్తు ఉండదని, ఈ సారి చిరును తెలంగాణలో అడుగుపెట్టనీయబోమంటూ హెచ్చరించడం బట్టి మాటలతో ఈ పార్టీల మధ్య ఆగాధం పెరగినట్లు కనిపిస్తోంది.
ఐక్యత లేని వామపక్షాలు...
అసలు వామపక్షాల మధ్యే ఐక్యత లేకపోవడం ఈ రెండు పార్టీలు చివరికు ఎటువెళ్తాయో తెలియని పరిస్థితి నెలకొంది. సీపీఎం ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీతో కలిసి వెళ్లాలని ఇప్పటికే దాదాపుగా నిర్ణయిం చుకోగా, సీపీఐ మాత్రం పీఆర్పీతో పోటీ చేస్తే బాగుంటుందని భావిస్తోంది. పైకి వామపక్షలు రెండూ తాము కలిసే పోటీ చేస్తామని ప్రకటిస్తున్నప్పటికీ, వాటి భావాలు మాత్రం పరస్పర విరుద్ధంగా కనిపి స్తున్నాయి. అయితే బయటకు మాత్రం వామపక్ష ఐక్యత పేరిట హడావిడి, కలిసే పోటీ చేస్తామంటూ ప్రకటనలు చేస్తున్నప్పటికీ, ఆ రెండు ఎవరితో వెళ్లాలన్న అంశంపై ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నాయి.

0 కామెంట్‌లు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

దీనికి సబ్‌స్క్రయిబ్ చేయి కామెంట్‌లను పోస్ట్ చేయి [Atom]

<< హోమ్